Poetry in Telugu

నేను ఎప్పుడూ సకలవృత్తుల సమ్మోహన సౌందర్యాన్నే
నేనెప్పుడు సర్వకళల సోదర సమతా వాదాన్నే
నేనెప్పుడూ చైతన్య అశ్వరూఢనైన జ్ఞానరథసారథినే
 నేనెప్పుడూ త్యాగోన్నత
 ఉద్యమ భాగస్వామ్యాన్నే
నేనెప్పుడూ ప్రశ్నల ఆయుధాలతో దోపిడీలను ఎదిరించే ప్రజాపక్షాన్నే
నేనెప్పుడూ పూలే క్రాంతి దృక్కుల దర్పణాన్నే
అనేక నేనుల అస్తిత్వాల సమ్మిళితమైన మేము
బహువర్ణ సంకలిత సింగిడీలము
నీలివర్ణ జ్ఞానబోధ – రుధిరవర్ణ చైతన్యం – హరితవర్ణ ఆహార్యం
చీకటి చరిత్రలను దున్నుతున్న వెలుతురు హలాలమే మేము
మేమిప్పుడు అంబేడ్కర్ క్రియాకౌశల్యాల పుష్పాలమే
మేము ఇప్పుడు నాయకత్వాల మార్గదర్శకులం
నేను మేముగా కలిసి మనంగా
పుట్టుక వలన పాలన నోచని మనం
పోషణకే తావు ఎరుగని మనం
ఇప్పుడు మనం అంటే సంఘటితం
మనం అంటే సంపూర్ణం
అసంపూర్ణ అభివృద్దికి – అసంతృప్త ఆకాంక్షలకు
పదునైన స్వరాలను తగిలించే మనం
జ్ఞాన కవచంతో శాంతి వ్యవసాయానికి సిద్దం
మనం బోధివృక్ష విస్తారక్షేత్రాలం
నేను మేముగా ఎదిగి – మనంగా పంచి పెంచుకోడానికి
ఇపుడు మనంగా ఎరిగి పెరిగి పంచుకోవాలి
నేను సైతం జ్వాలనై జ్యోతినై జ్వలితనై
నేను సైతం కైతనై కేకనై రాజ్యకేతనమై
———
(జ్వాల= మంట(కాల్చేది), జ్యోతి=వెలుతురు పంచేది,
జ్వలిత= కాలుతూ వెలుతురుతో కూడిన శక్తి)
జ్వలిత/చండాలిక రాజ్యం
వీరస్వర్గాన్ని విశ్వసించని రావణ సంతతి నేను
నా నీడలు నేలను తాకవు
నా దు:ఖనది నిద్రపోదు
దారాలు మెడల్లో కట్టబడి కొందరు
నడుముకు చుట్టుకొని మరికొందరు
వేపుల మీదుగా చుట్టుకొని ఇంకొందరు
పవిత్ర సమూహాలయి సంచరిస్తూన్నారు
నూలుపోగులు ఏ మూల చుట్టబడినా
బడుగు బహుజన బాహుభలులు
కుబుసాలను  వదిలించుకోవాలిప్పుడు
కోరకుండా లభించిన చ్నద్రహాసం
బలి కోరుతూ తలపై వేలాడుతూన్నది
పడగలిప్పిన వర్ణసర్పాలు
శ్రీరంగ నీతుల ధర్మాని భోదిస్తూనే ఉన్నాయి
స్పృహను చైతన్యంగా మార్చగల చాతుర్యం ఒక ఔషధం
పొదల మధ్య వధించబడుతున్న జంబుకుమారులు
కాంక్రీటారణ్యంలో వేటాడబడుతున్న తారకా సమూహాలు
లోహపు తెరల మాటునసమ్హరించ బడుతున్న శంబూకులు
ఏక మంత్రోచ్ఛారణతో అజగస్తనాలు కుట్రను గుర్తించాలి
రుషుల మూలాలు నదుల మూలాలు లభ్యమే
అనాదిగా స్త్రీసమ్హార మూలాలే అలభ్యం
సంతృప్త స్థానాల అధికారాన్ని దొరకనివ్వనిది
దు:ఖనాడులను పసిగట్టిన హరిశ్చంద్రం
పవిత్ర పట్టెడను పట్టిబిగించిన పాతివ్రత్యం
పుట్టబోయె ముసలాలను మనువు కాతాలో వేసే బానిసత్వం
వీరులయిన వారి పార్దివదేహాలూ గౌరవయోగ్యాలే
జీవితాంతం ధీరవనితలకు వీరమాతలకు అవమానాల ఆభారాణాలే లభ్యం
సకల యుగాల యగ్నవల్కులందరూ
మారు మనువులకై కాత్యాయనులను అన్వేషిస్తారు
మోదుగుపూవనాలు బహువిధ పవనాలను కూడి
ధర్మరాజు రథాలయి గులాబీ ఏకవీరులతో ఏకమవుతున్నాయి
జేగురు రంగు బాసలతో జీబురుగడ్డపు నల్లని ముసుగు
శ్వేతవస్త్రాల వెనుక వున్న నెత్తురు మరకలు
రేపటి చరిత్రకు పునాదులు
అధికారపు కత్తిపదునున్నవాడు
ఏరంగునయినా ఏమారుస్తాడు
అణిచివేతల రాజ్యం పై కత్తిగట్టే వాడికి
ఏ రంగూ అవసరం లేదు
పైడికోటల్లో పసిడిబొమ్మలను
ఎండ కన్నెరుగని వెండికాంతలను పక్కకు నెట్టి
కాలచక్రంలో కణకణమండే కాష్టం నుండి లేచి
నిషిద్ద మర్మాలెరిగిన చండాలిక రాజ్యమేలాలి
          ………
జ్వలిథ/ చండాలిక రాజ్యం/
25-05-2014(ఉదయం 5.50)
పాలు- సున్నపు నీళ్ళు/జ్వలిత
ఇక్కడ చెంచాల సమ్మేళనం సాగుతూన్నది
కొన్నిపాత్రల కనుసైగలతో సదస్సు మొదలైంది
కారంకుండను చూచి మంటలనుకొని
అంటించని పొయ్యి చుట్టూ
గంటెలు సాగిలపడుతున్నాయి
గాజులులేని చేతివంట రుచుండదని
సన్నాసిశిబ్బి సన్నాయి ఊదుతూన్నది
వండనివీ వండినవీ వంతులేసుకొని
మింగుతున్న చీమలు కవాతు చేస్తున్నయి
ఆరగింపులకు ఆటంకమని పిల్లులు
ఎలుకలను బందిస్తున్నయి
ప్రేమైక వస్తుసౌందర్య నగ్నబొద్దింక ముగ్దరమణీయ ప్రదర్శన
రాతికుప్పల మీద చూపుల బూతులకు
మాంసపు ముద్దలమీద వాతలేసుకుంటున్నయి మెదళ్ళు
ఇంకా చెంచాల సమ్మేళనం నడుస్తూన్నది
మసిగుడ్డలన్నా కప్పండని
గంగాళం గొంతు చించుకుంటున్నది
ఈగలు దోమలు పిలుపులందుకొని
పీలికలు సర్దుకొని బాకాలూదుతున్నవి
ఆశల జాలాట్లో దొర్లుతున్న పందులు
ఉలికిపడి ఉరుకుతున్నయి
ఉడకని అన్నానికి తల్లెలు పట్టిన ఆకలిని
పక్కసందులకు గుంజుతున్నయి పందికొక్కులు
ఎముకలు కొరికే దరిద్రం
వెన్నెల్లో ఆడపిల్లయి తోడేళ్ళగోళ్ళకు రంగేస్తూన్నది
చెంచాల సదస్సు లొల్లాయి పదాలను చిలకరిస్తూన్నది
అజీర్తి వాయువు ముక్కులను శుభ్రం చేస్తూంటే
వెలగని పొయ్యికి హారతిస్తూన్నది కల్యమాకు
ఎంగిలే కాని గిన్నెలు తమకింక డోకాలేదని చెంచాలకు చరఘగీతం పాడుతున్నాయి
గేటు పక్క డేరాలో ముడుచుకున్న బక్కకుక్కపిల్ల
ఆకలి పెంచె పదార్థాలను చూపడం
జాతి భవితకు హానికరం అంటున్నది
ఇది సాఫ్ట్ ఫోర్న్ ఎందుకు కాదో
చెప్పమంటున్నది గోడమీద బల్లి
ఆరంభం కాకుండానే ముగించబడిన వంట సదస్సు
జల్లిగంటెకున్న పరిణితి చెంచాలకుండదని
తీర్మానించింది
ప్రాణలింగం బోడిలింగంపై టోపీ ఒకటేనని
పాలకు సున్నపునీళ్ళుకు తేడా తెలవక పేగులు కాలాయని
బెల్టుషాపు నుండి తూలుతూ వచ్చిన పట్టుకారు
చెంచాల సదస్సు ముగిసిందని ప్రకటించింది
మళ్ళీ వచ్చే చీకట్లలో కలుసుకుందామని
పురుగూ బూసి భుజాలు తడుముకొని విడిపోయాయి

నేనొక అంకురాన్ని
రేపటి మానవ జాతికి మాతృకను
నేనొక విత్తనాన్ని
గింజలను మింగే మీరు
హంతకులుగ మిగులుతారు
కానీ అమ్మే లేని ప్రపంచానికి
కలల రచన చేస్తూన్నదెవరు
నీ అపురూపమైన జీవితాన్ని
విషబీజాలు నాటిందెవరు
ఓ మనిషీ
నువ్వు కూచున్న కొమ్మను
నువ్వే నరుక్కుంటున్నావెందుకు
కాకి పిల్ల కాకికి ముద్దు
నువ్వు కాకివి కూడా కాలేవా
పసిపిల్లలం అమ్మ పాల వాసన మాయని వాళ్ళం
మమ్మల్ని ప్రేమించకు
వికారపు ముద్దులు కురిపించకు
నీ మృగజాతి అనవాళ్ళు తుడిపేందుకు
మమ్మల్ని రక్తపు మడుగులుగా దున్నకు

నాకు తెలుసు
నువ్వు ఆకాశం నుండి రాలి పడలేదు
నువ్వు మరో గ్రహాంతరవాసివి కాదు
మాతోపాటు పుట్టి
మామధ్యే మసులుతూ పెరిగావు
కదులుతూ మెదులుతూ ఎదుగుతూ
నీ పైశాచిక లక్షణాలు చూపించే ఉంటాం
అమ్మ చూసే ఉంటది
అక్క గునిసే ఉంటది
టీచరు గుర్తించే ఉంటది
తండ్రి మామూలే అనుకుని ఉంటడు
తాత తన గుర్తులను పసిగట్టి మౌనమై ఉంటడు
ఇరుగు ఆంటీ మన కెందుకులే అనుకొనుంటది
పొరుగు అంకుల్ మగాడులే అని సమర్థించుంటడు
పోలేసు కేసులెక్కవై వదలేసుంటడు

మద్యం మత్తులో ముంచిన పాలకులు
బూతుబొమ్మల వ్యాపారులు
మీకోసం వాదించే నల్లకోట్లు
అసత్య రిపోర్టులిచ్చే డాక్టర్లు
వీళ్ళంతా నీ జాతివాళ్ళే
అత్యాచారాల వరుసలో
నీ వెనుకే వాళ్ళు

ఏముంది ఇందరి ఉపేక్ష
పసిపిల్లలం మా పాలిట హింస రచనయింది
పాలుకారే చెక్కళ్ళు
పువ్వు వంటి దేహాలు
యుద్ద బీభత్స రుదిర క్షేత్రాలుగా మారుతున్నయి
పాపం నువ్వు ఆడుకుంటున్నవు
అనాది ఆటబొమ్మలం
నీ ఉన్మాద క్రీడలకు సాక్షాలం

మీ కోరికలు రేపే మెదళ్ళ స్థానంలో
దయగల హృదయాలను
క్యాస్ట్రేషన్ అవసరం లేకుండా
కరిగి పోయే మైనపు లింగాలిమ్మని

మాకు యోనుల స్థానంలో
గిలిటెన్ యంత్రాల కోసం
కామాఖ్య యాగం చేస్తూన్నాం